రాజకీయాలు

ప్రత్యేక హోదా అంటే ఏమిటి?

ప్రత్యేక హోదా అంటే ఏమిటి ? దాని వలన నిజంగా కలిగే ప్రయోజనాలు ఏమిటి?

రాష్ట్రం  అంతా ప్రత్యేక హోదా మీద చర్చ నడుస్తున్నది. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేము దానికి  బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాము అని ప్యాకేజీ కింద కొంత ప్రకటించింది. అధికార పక్షం కూడా ఇచ్చింది తీసుకుందాం మనకు హక్కుగా రావాల్సిన దాని కోసం పోరాడుతాం అంటున్నది. విపక్షాలు మాకు ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదానే కావాలి అని నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రత్యేక  హోదా కావాలనే వారిలో చాలామందికి హోదా మీద పూర్తి అవగాహన లేదు అనేది సత్యం, దీనిని ఆసరాగా చేసుకొని ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు సొంత పైత్యాలు రుద్దుతున్న ఈ సమయంలో అసలు ఈ ప్రత్యేక హోదా అంటే ఏమిటో ఒకసారి చూద్దాం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు ఏమిటి ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసినప్పుడు నాలుగు ప్రధాన హామీలు ఇచ్చారు  అవి
1. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 90 క్రింద పోలవరం ప్రాజెక్ట్
2. సెక్షన్ 94  క్రింద పారిశ్రామీకరణకు పన్ను రాయితీలు
3.20-02-2014న రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తాము అనే ప్రకటన
4. రాష్ట్ర రెవెన్యు లోటుని అంచనా వేసే బాధ్యత 14వ ఆర్ధిక సంఘానికి అప్పగించడం
ఇంకా అనేక సెక్షన్లు ఉప సెక్షన్లు ఉన్నాయి అవన్ని ఇప్పుడు అనవసరం మన సమస్యల్లా ప్రత్యేక హోదా కాబట్టి దాని వరికే పరిమితం అవుదాము

అసలు ఈ ప్రత్యేక హోదా అంటే ఏమిటి ?

ఇది అర్ధంచేసుకోవాలంటే ముందు కేంద్ర ప్రభుత్వ ఆదాయం అందులో నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు పంచే విధానం గురుంచి  కొంత తెల్సుకోవాలి.
కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులులో  నుండి కొంత భాగాన్ని రాష్ట్రాలకు పంచుతoది. వాటిని రెండు విధాలుగా పంచుతారు
1. ప్లాన్ ఫండ్స్ (Plan Funds)
2. నాన్ ప్లాన్ ఫండ్స్  (Non-Plan Funds)
ప్లాన్ ఫండ్స్ (ప్రణాళికా నిధులు) ప్లానింగ్ కమిషన్ (ప్రణాళికా సంఘం) కేటాయిస్తుంది. ప్రతి ఐదు ఏళ్ళకి ఈ ప్లానింగ్ కమీషన్ పంచ వర్ష ప్రణాళికని సిద్దం చేస్తుంది. ప్లాన్ ఫండ్స్ నుంచి అభివృద్ధి పధకాలకు ఖర్చు చేస్తారు
ఉదాహరణ : రోడ్లు, ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ లు,  ఆరోగ్య రంగంకి, ఇలా అన్న మాట. 
నాన్ ప్లాన్ ఫండ్స్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పధకాలు, జీతభత్యాలు మొదలయిన వాటికి ఖర్చు చేస్తారు. వీటిని ఎలా ఉపయోగించాలి అనేది చెప్పడానికి ప్రతి ఐదు ఏళ్ళకి ఒక ఆర్ధిక సంఘం ఏర్పాటు చేస్తారు .ప్రతి ఆర్ధిక సంఘం అప్పటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిధులు రాష్ట్రాల మధ్య పంచి పెడతారు. అప్పటి ప్రభుత్వాలని బట్టి లెక్కలు మారుతుంటాయి.

రాష్ట్రాలకి ప్రత్యేక హోదా అనేది ఎప్పుడు మొదలైంది :

1968 లో ప్లానింగ్ కమీషన్ మొదటి సారిగా  ఈశాన్య రాష్ట్రాలు అయిన నాగాలాండ్ , అస్సాం లతొ పాటు జమ్మూ కాశ్మీర్ కు ప్లాన్ ఫండ్స్ లో భాగంగా కొంత ప్రత్యేక గ్రాంట్ ని వారికి ప్రత్యేకంగా (కొండ ప్రాంతాలు ,ఇతర దేశాల స్సరిహద్దులు అవడం పారిశ్రామీకీకరణకు అవకాశాలు తక్కువ కావడం వల్ల )మొదటి సారిగా ఇచ్చింది. ఐదవ ప్లానింగ్ కమీషన్ 1974 సంవత్సరం లోఇంకో ఏడు రాష్ట్రాలకు కూడా ఈ ప్రత్యేక గ్రాంట్ ని ఇచ్చింది. వీటిని ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలుగా పిలవడం పరిపాటి.
ఈ ప్రత్యేక  హోదా కలిగిన రాష్ట్రాలకు ఇచ్చే ప్రత్యేక నిధులు ప్లాన్ ఫండ్స్ లోనే  ఇస్తారు కాని  నాన్ ప్లాన్ ఖర్చుకి కాదు ఇది ముఖ్యమైన విషయం.

ఏమిటీ గాడ్గిల్ -ముఖర్జీ ఫార్ములా :

ఇది 1992-93 లో వచ్చింది. గాడ్గిల్ ఫార్ముల ప్రకారం  మొత్తం కేంద్ర ఆదాయంలో  ముందు గా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు  కావాల్సిన నిధులు ఇచ్చిన తర్వాత మిగిలిన దానిని ఇతర రాష్ట్రాలకు పంచాలి అని. ఈ ఫార్ముల పై అనేక తర్జనభర్జనలు జరిగాక రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని 1991 లో అప్పటి ప్లానింగ్ కమీషన్ డిప్యుటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ నాయకత్వంలో ఒక కమిటీ వేసారు.
ఆ కమిటీ ఇచ్చిన నివేదికే ఈ గాడ్గిల్ – ముఖర్జీ ఫార్ములా, దాని ప్రకారం ప్రత్యేక హోదా కలిగిన పది రాష్ట్రాలకు కేంద్రo వాటాగా రాష్ట్రాలకు ఇచ్చే ప్లాన్ నిధులలో 30 శాతం కేటాయించారు మిగతా 70 శాతం ప్రత్యేక హోదా లేని ఇతర రాష్ట్రాలు ఇవ్వలని ప్రతిపాదించారు.
ప్రత్యేక హోదా రాష్ట్రాలకు కేంద్ర ప్రభత్వ పధకాల్లో 90% గ్రాంట్ గా 10%  అప్పుగా పరిగణించబడుతాయి ఇతర రాష్ట్రాలకు అది 30%-70% గా ఉంటుంది.
అలా 2002లో అప్పటి NDA ప్రభుత్వంలో ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్ ఏర్పడినప్పుడు కేంద్ర కాబినెట్ ఆ రాష్ట్ర బౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక హోదా కోసం పర్సీలించి ఒక నివేదికని NDCకి (National Development Council) ముందుకు తెచ్చారు. అలా NDC ఆమోదం తర్వాత ఉత్తరాఖండ్ కు ప్రత్యేక హోదా ఇచినట్టు అయినది. ఉత్తరాఖండ్ రాష్ట్రమే ప్రత్యేక హోదా కలిగిన చివరి రాష్ట్రం.

ప్రత్యేక హోదా కలిగి ఉండాలంటే కొన్ని ప్రమాణాలు ఉండాలి

 • రాష్ట్రం పొరుగు దేశం తో సరిహద్దు కలిగి ఉండాలి.
 • ముప్పాతిక భాగం కొండలు గుట్టలతో నిండి ఉండాలి
 • జీవన ప్రమాణాలు తక్కువ ఉండి ఉండాలి
 • పారిశ్రామీకీకరణ , ఇన్ఫ్రా స్ట్రక్చర్ తక్కువ స్థాయిలో ఉండటం
ఇలా కొని పరిమితులకు లోబడి ఉండాలి. అలా ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇస్తారు.
విభజన అప్పుడు అన్ని ప్రమాణాలు లేకపోయినా కొన్ని ఉండటం వల్ల అప్పటి రాజకీయ కారణాల వల్ల మనకు ఇస్తాము అని హామీ ఇచ్చారు. కాని ఆంధ్రప్రదేశ్ విషయంలో పార్లమెంట్ లో ప్రధాని హామి తరువాత కేంద్ర కాబినేట్ తీర్మానం చేసి ప్లానింగ్ కమీషన్ కి పంపి, నివేదిక వచ్చేలోపే ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్లానింగ్ కమీషన్ ని NDCని రద్దు చేసింది. అది అలా ఉంచితే..
 ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే ఈ ప్రత్యేక హోదా కలిగి ఉండటం వల్ల మనకు మామూలుగా వచ్చే వాటా కంటే ఎక్కువ నిధులు వస్తాయి అది కూడా ప్లాన్ ఖర్చుకి మాత్రమే. పన్నురాయతీలు లాంటివి లేవు అవి ప్రత్యేక హోదాలో భాగం కానేకాదు.

పన్ను రాయితీలు – అవి ప్రత్యేక హోదాలో భాగమా ?  –  “కానే కాదు”

1968 నుండి రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉన్నాగాని పన్ను రాయితీలు మాత్రం 2002 నుండి మాత్రమే ఆ మినహాయింపులు అమలులోకి వచ్చాయి. అవి కూడా 5 ఏళ్ళపాటు మాత్రమే ఇచ్చారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఉన్న భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా మరియూ సరిహద్దు రాష్ట్రాలు అయి ఉండటం వలన ఈ సదుపాయం అప్పటి ప్రభుత్వం కల్పించింది.
అప్పటి వరకు ప్రత్యేక హోదా ఉన్న8 రాష్ట్రాలకు 2005 వరకు, సరిహద్దు రాష్ట్రాలు అయిన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్ కు 2010 వరకు పన్ను రాయితీలు కల్పించారు.
అయితే తరువాత వచ్చిన UPA వాటిని మరో 7 సంవత్సరాలు (5 ఏళ్ళు ఒకసారి, 2 ఏళ్ళు మరోసారి) పొడిగించింది. అలా వచ్చిన పన్నురాయితీలు 2014తో 8 రాష్ట్రాల్లో మినహాయింపుల నుండి ఉపసంహరించడం అయింది.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్ కు 2017తో ఉపసంహరింస్తారు. ఆ తరువాత దేశంలో ఎక్కడా పన్ను మినహాయింపులు ఉండవు.

“2017 తరువాత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పన్ను రాయితీలు ఉండవు”

 పన్ను మినహాయింపులు తీసి వేసినా ఇవి ప్రత్యెక రాష్ట్రాలుగా చలామణి అవుతున్నాయి ఎందుకంటే సరిహద్దు రాష్టాలు, కొండ ప్రాంతాలు అవటం వలన ప్రత్యేక హోదా ఉంది మరి దాని వల్ల ఉపయోగం ఏమిటి అంటే .. అదే చౌహాన్ ఫార్ములా!

 ఏమిటీ చౌహాన్ ఫార్ములా..?

NDA ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే పబ్లిక్  ఫైనాన్సు మరియు ఆర్ధిక అభివృద్ధి నమూనా విప్లవాత్మక మార్పులు రూపేణా ప్రణాలికా సంఘాన్ని, జాతీయ అభివృద్ధి మండలిని రద్దు చేసి నీతి ఆయోగ్ ని ఏర్పాటు చేసింది. ఈ నీతి ఆయోగ్ అనేది కేంద్ర ప్రభుత్వానికి ప్రణాలికా సంఘం, ఫైనాన్సు కమిషన్ చేసే పనులను ఇంకా బాగా ఎలా చేయొచ్చో లెక్కలు, సలహాలు చెప్పే సలహా మండలి మాత్రమే… అంతకన్నా ఎటువంటి అధికారాలు లేవు.
ప్రణాళిక సంగం లేదు కాబట్టి ప్లాన్ ఫండ్స్ లాంటివి ఇంకా లేవు. ఫైనాన్సు కమీషన్, NDC లాంటివి లేవు కాబట్టి ప్రత్యేక హోదా లాంటివి, ఆ హోదాతో 30% నిధులు లాంటివి కూడా లేవు… అన్నిటికీ చరమ గీతం పాడింది కేంద్ర ప్రభుత్వం. అలానే 14వ ఆర్ధిక సంఘం ఇకనుండి ఏ రాష్ట్రానికి ప్రత్యెక హోదా అవసరం లేదు, ప్రతి రాష్ట్రాన్ని ఆ రాష్ట్రం యొక్క అవసరాలను బట్టి నిధులు ఇవ్వాలి అని చెప్పింది. అలా ప్రతి రాష్ట్రానికి ఉన్న లోటుపాట్లను పూరించటానికి పూనుకుంది.
 • కేంద్ర – రాష్ట్ర  ఆదాయ పంపిణి ని కూడా మార్చేసింది. గతంలో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే నిధులు 32%గా ఉంటే వాటిని 42%కు పెంచింది..
 • దానితో పాటు  ఆర్దికలోటుతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు  ప్రత్యేక గ్రాంట్ లు కేటాయించింది. గతంలో ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలతో పాటు ఆర్ధిక లోటున్న మన ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియూ కేరళ  రాష్ట్రాలని కూడా కలిపింది.
 • అయితే పశ్చిమ బెంగాల్, కేరళకు ఈ ప్రత్యేక గ్రాంట్ ని కేవలం 1 సంవత్సరానికే పరిమితం చేసారు.
 • మన ఆంధ్ర ప్రదేశ్ కు, గత 11 ప్రత్యేక హోదా రాష్ట్రాలకు 5 ఏళ్ళు ఇచ్చింది. ఎట్టాగో ఆ 11రాష్ట్రాల సరసన చేరింది మన రాష్ట్రం.(ఈ రకంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 5ఏళ్ళల్లో దాదాపు 22,500 కోట్ల రూపాయిలు అందుతాయి. ఇది కేంద్ర ప్రభుత్వం మనకు ప్రత్యేకంగా ఇచ్చినది ఏమి కాదు అందరితో పాటే రెవిన్యూ లోటు భర్తీ కింద ఇవ్వక తప్పని చట్ట బద్ధమైన హక్కు)
ఈ ఆర్ధిక సంఘం ప్రణాలికేతర అనగా Non-Plan Funds అంశాలపై జీతభత్యాలు, సంక్షేమ నిధులపై అజమాయిషీ చేస్తుంది.
అసలు ఈ ప్రణాలికా సంఘం, ఫైనాన్సు కమిషన్, పంచవర్ష ప్రణాళిక ఇవన్నీ రద్దు చేసిన తరువాత ఈ నిధులు ఏమయ్యాయి? ఎక్కడికి పోయాయి? ఎలా పంచబడ్డాయి? వీటి కోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక కమిటీని నీయమించారు. ఆ కమిటీ ఇచ్చిన ఫార్ములానే ఈ “చౌహాన్ ఫార్ములా”.
చౌహాన్ ఫార్ములా ప్రకారం అందుబాటులో ఉన్న నిధులను ఆయా రాష్ట్రాల భౌగోళిక, ఆర్ధిక, సామజిక స్థితిగతులను బట్టి పంచుతారు. ఆ నిధులను రెందు రూపాలలో అందిస్తారు.
1. సెంట్రల్లి  అస్సిష్టేడ్ స్టేట్ ప్లాన్( CENTRAL ASSISTED STATE PLAN – CASP) 
2. యక్ష్టర్నల్లి  ఎయిడెడ్ ప్రాజెక్ట్ ( EXTERNALLY AIDED PROJECT – EAP)
నిధులలో CASPదే  అధిక భాగం. అన్ని రాష్ట్రాలకు 60% CASP నిదులు వస్తాయి,  ఆ 11 రాష్ట్రాలకు మాత్రం 90% నిధులు పొందుతాయి. ఈ 11 రాష్ట్రాలు భౌగోళికంగా చిన్నవి కాబట్టి కేంద్రమిచ్చే అదనపు 30% నిధులు పెద్దగా ప్రభావం చూపావు.
EAP  (Externally Aided Projects)  అంటే ఏమిటి ?
కొన్ని సార్లు  కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ నుంచి కాని ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి కాని ఇతర విదేశీ సంస్థల నుంచి కాని నిధులు తెచ్చి కేంద్ర పధకాలను అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తుంది. అలాంటి నిధుల్లో కేంద్రం 60% ఖర్చు భర్తిస్తే రాష్ట్రాలు 40% భరిస్తాయి.ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలుకు అవి కేంద్రం 90% – రాష్ట్రం 10% భరిస్తాయి.
అదే రాష్ట్రాలే సొంతంగా EAPలు తెచ్చుకుంటే మొత్తం అప్పు రాష్ట్రమే భరించుకోవాలి కేంద్రం హామీ దారుడిగా మాత్రమె వ్యవహరిస్తుంది.

అది సరే, మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పరిస్థితి ఏమిటి ?

 • 2014 ఫిబ్రవరిలో మన్మోహన్ సింగ్ ప్రధాని గా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అనే అంశం ఉంది.
 • 2014, జూన్ కి మోడీ ప్రభుత్వంలో అ హోదా అనే యవ్వారమే తీసేసాడు
 • గతంలో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలను ఇప్పుడు హిల్ స్టేట్స్ గా వ్యవహరిస్తున్నారు.
 • గతంలో 30% ప్లాన్ ఫండ్స్ ని పంపిణీ చేసేవారు ఈ రాష్ట్రాలకి ఇప్పుడు చౌహాన్ ఫార్ములా ప్రకారం 90% గ్రాంట్ గా CASP & కేంద్ర EAP(ఉంటే) లభిస్తున్నాయి.

మరి మన సంగతి ఏమిటి ? మనకిచ్చిన హామీ ఏమైంది?

మరి రాజ్యసభలో ప్రధాని హామికి విలువలేదా అని మన అడుగుతున్నాం?
అసలు  ప్రత్యేక హోదా అనేదే లేనప్పుడు మేము మీకు హోదా ఎలా ఇస్తాం అని కేంద్రం మొండికేసింది.
.
అలాంటప్పుడు హోదా పేరుతో కాకుండా CASPలో 30% అదనంగా ఇవ్వమని మన ముఖ్యమంత్రి  చంద్రబాబు గారు అడిగారు. దానికి కేంద్రం మీకు అలా ఇవ్వడం కుదరదు అలా మీకు ఇస్తే అన్ని రాష్ట్రలు అడుగుతాయి అంతే కాక బడ్జెట్ లో కూడా ప్రొవిజన్ లేదు. అలా ఇస్తే ప్రత్యేక హోదా రద్దు చేసిన ప్రధాన ఉద్దేశం నీరుగారి పోతుందాని చెప్పటం మొదలెట్టారు.
ఈ సందర్భంగా అనేక సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళటం, ఆయన వివిధ పద్దతులు – అనేక ఫార్ములాలు కేంద్ర ఆర్ధిక శాఖ ముందుంచటం వాటిని ఏదో ఒకటి చెప్పి తిరస్కరించటం. రెండు సంవత్సరాల నుండి ఇదే తంతు.
చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పరిష్కార మార్గం ప్రతిపాదించారు.
“CASPలో ఎక్కువ ఇవ్వమంటే కదా మీకు ఇబ్బంది; ఇతర రాష్ట్రాలు అడ్డం పడుతాయి అని అంటున్నారు కాబట్టి మాకు CASPలో ఇచ్చే 30% నిధులను కేంద్ర EAPలో ఇవ్వండి” అని. CASP అనేది అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉంటది అదే EAP అయితే ఏ రాష్ట్రం అవసరనికి అనుగుణంగా ఆ రాష్ట్రానికి ఉంటుంది కాబట్టి దానిని ఇతర రాష్ట్రాలు అభ్యంతర పెట్టలేవు అని మార్గం చూపారు.
 • బాబు ప్రతిపాదనకు కాదు కుదరదు అని చెప్పలేని స్థితి కేంద్రానిది.
 • చివరకు ఈ ప్రతిపాదనను అతి కష్టం మీద ఒప్పుకున్నారు.
 • ఈ విధానం వల్ల మనకు లాభం ఏమిటి ? నష్టం ఏమిటి ?
 • ఇది అర్ధం చేసుకోవాలంటే మనము కొన్ని విషయాలు తెలుసు కోవాలి.. 

సాధారణంగా EAPs కింద తీసుకునే రుణం 5 – 7 సంవత్సరాలు తరువాత చెల్లింపులు మొదలవుతాయి.ఆ చెల్లింపుల కాలపరిమితి 10-15 సంవత్సరాలు ఉంటది. ఆ తీసుకునే రుణం ఆ సంవత్సర FRBM (Financial Regulation and Budget Management) పరిమితికి లోబడి ఉంటది; ఇది సాధారణంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.5%గా ఉంటది.
చంద్రబాబు గారు జైట్లీ ముందు పెట్టిన ప్రతిపాదనలోకి వస్తే CASPలో 30% అధికంగా నిధులు ఇవ్వడం కుదరదు అన్నారు కాబట్టి ఈ 30% నిధులను కేంద్ర ప్రభుత్వ EAP కింద ఇవ్వమని కోరడం దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం జరిగింది.
ఉదాహరణకి :
మన రాష్ట్రం ప్రతి సంవత్సరం ఒక 10,000 కోట్లు CASP కింద ఖర్చు పెడుతుంది అనుకుందాం. మామూలు గా అయితే ఇందులో 6000కోట్లు(60%) కేంద్రం భరిస్తే – రాష్ట్రం 4000కోట్లు(40%) భరిస్తాయి.
అదే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రం అయితే కేంద్రం 9000కోట్లు(90%) – రాష్ట్రం 1000కోట్లు (10%)భరిస్తాయి. 
మనకు ప్రత్యేకహోదా లేకపోవడం వల్ల మనం ప్రతి సంవత్సరం నష్టపోతున్నది 3000 కోట్లు .
చంద్రబాబు – జైట్లీ ఫార్ములా ప్రకారం మనం CASPలో నష్టపోతున్న మొత్తాన్ని (3000 కోట్లు)ని కేంద్రం EAP రూపంలో ఋణం తీసుకున్నట్లుగా చూపి, ఆ రుణాన్ని కేంద్రమే తీసుకొని ఆంధ్రప్రదేశ్ కి తిరిగి చెల్లిస్తుంది. అంటే EAPల ద్వారా మనం 3000కోట్లు లబ్ది పొందుతున్నాము అదే సమయంలో CASP ద్వార మనము 4000కోట్లు కట్టాలి..
డబ్బు పరంగా చూస్తే లెక్క సరిపోయింది, కాబట్టి మనకు వాస్తవంగా పడుతున్న భారం 1000 కోట్లే .అంటే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంకి ఎంత భారంపడుతుందో మనకు అంతే పడుతుంది. ప్రత్యేక హోదా  రాష్ట్రాలకు వచ్చే బెనిఫిట్ ని ఈ విధంగా మనకు దక్కుతుంది.
ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏమిటి అంటే EAP కింద 3000కోట్లు కేంద్రము తీసేసుకోవడం వల్ల మన FRBM   మీద భారం అ మేరకు తగ్గుతుంది. అంటే FRBM లిమిట్ దాటకుండా మనము ఇంకో 3000కోట్ల ప్రతి సంవత్సరం పొందవచ్చు.
ఈ విధానం వల్ల ఆంధ్రప్రదేశ్ కు రానున్న 5 ఏళ్ల లో 22,500 కోట్ల నిధులు అందుబాటులో ఉండటమే కాక ఇంకో 22,500 కోట్లు స్వల్పకాలం (5-7సంవత్సరాల్లో ) లభ్యం అవుతాయి. ఈ మొత్తం కలిపి సుమారుగా 45,000కోట్లు. ఇదేమి చిన్న మొత్తం కాదు.
అంటే ప్రతి సంవత్సరం 3000-5000కోట్లు  మేర  EAPలను చేపట్టి అమలు చేయాలి, దీనికి సంస్థాగత సామర్ధ్యాన్ని పెంచుకోవలసి ఉంటుంది. ఇప్పటి వరకు 2014 లో మనం కేవలం 600 కోట్లు 2015 లో 900 కోట్లు EAPల ద్వార  ఖర్చు పెట్టాము. మరి ఇంత పెద్ద మొత్తాలు ఖర్చు చేయాలి అంటే మనం ఎంత పకడ్బందీగా నడవాలి. అది చంద్రబాబు లాంటి సమర్ధవంతమైన నేత వల్లే సాధ్యం. ఇప్పటికే మన రాష్ట్రం 42,000కోట్ల EAPల కోసం DPRలు సిద్దం చేసింది.

కాబట్టి ఇప్పుడు చెప్పండి ప్రత్యేక హోదా వల్ల మనకు వచ్చే ప్రయోజనాన్ని చంద్రబాబు నాయుడు సాదించారా లేదా?
ప్రత్యేక హోదా అనే పదం లేదు కాని దాని వల్లవచ్చే బెనిఫిట్స్ అన్ని వచ్చాయా  లేదా?

“క్రిందా మీద పడి హోదాతో వచ్చేవన్నీ చంద్రబాబు సాధించారు”

మరి పన్ను రాయతీ మినహాయింపుల పరిస్థితి ఏమిటి?

ముందే చెప్పినట్టు ప్రత్యేకహోదాకి పన్ను రాయతీలకు సంబంధం లేదు. అందరి అనుకుంటున్నది ఏమంటే పన్ను రాయితీ కూడా ప్రత్యేక హోదాలో భాగమే అని కాని అది నిజం కాదు

పన్ను రాయితీ వేరు…  ప్రత్యేక హోదా వేరు…
ప్రత్యేక హోదాలో పన్ను రాయితీ లేదు

2002లో మొదలయిన పన్ను రాయితీలు చాలా మటుకు 2014లో తీసేసారు మిగత రెండు రాష్ట్రాలకి 2017 నుంచి తీసేస్తున్నారు.

“GST వస్తున్ననేపధ్యంలో ఇక దేశం మొత్తం మీద ఎక్కడ పన్ను రాయితీలు ఉండవు”

విభజన చట్టంలో భాగంగా సెక్షన్.94 క్రింద ఆర్ధిక ప్రోత్సాహకాలు (Fiscal Incentives) అమలులో భాగంగా 15% అదనపు తరుగుదల భత్యం (Additional Depreciation) మరియు 15% మూలధనం(Capital Investment) పెట్టుబడి అలవెన్సు క్రింద ఇస్తున్నారు.

తరుగుదల(Additional Depreciation) అంటే సాధారణంగా అయితే వస్తువు తరుగుదల 30% ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 45%గా ఉంటుంది.

మూలధనం(Capital Investment) అంటే ఎవరైనా 100కోట్ల పెట్టుబడితో పరిశ్రమ స్థాపించితే, స్థూల లాభం నుండి 15కోట్లు పన్ను లెక్కింపు నుండి తీసివేయవొచ్చు. ఇది 3-5 శాతం లాభాలను పెంచుతుంది.

మన దగ్గర వ్యాపారాలకు అనువైన విధంగా ఉంటె అందరూ వచ్చి పెట్టుబడులు పెడతారు. కాని మన ప్రతిపక్ష నాయకుడు ఈ వాతావరణాన్ని ఎంత వరకు కలుషితం చేయాలో అంతవరకు చేయటానికి శతవిధాల ప్రయత్నం చేయడం మన ఏనాడో చేసుకున్న ఖర్మ.

ఇదండి ప్రత్యేక హోదా కధా కమామిషు…

ఇప్పుడు చెప్పండి ప్రత్యేక హోదానే కావాలి అని పట్టుకు కూర్చుంటే వారు ఇవ్వకపోతే నష్టపోయేది ఎవరు?
మనం కాదా? మన భావి తరాలు కాదా? మన పిల్లల భవిష్యత్తుని ప్రతిపక్షాలు పణంగా పెట్టి రాజకీయాల కోసం మాట్లాడటం హేయం కాదా? హోదా అని పేరు లేకుండా అన్నీ సాధించుకున్నాము. మీరూ చదివారు కదా, మీరు చెప్పండి తేడా ఏమిటో?

ఇస్తాం అన్న కాంగ్రెస్ ఇప్పుడు లేదు, ఇప్పుడున్న వారు సమానమైన ప్యాకేజి ఇస్తామంటున్నారు మరి. మనం ఏమి చేద్దాం?
రెండిటిని బేరీజు వేసుకొని చూసుకోకుండా మొండిగా వెళ్తే ఎవరికీ నష్టం, మనకే కదా.

పోనీ మాకు ప్రత్యేక హోదానే కావాలి అంటాము బి.జే.పి ప్రభుత్వం ఇవ్వదు, మరి అపుడు బి.జే.పి ని భూస్థాపితం చేస్తాము అంటాము. అలానే చేస్తాము దాని వల్ల బి.జే.పి కి ఎమన్నా పోయేది ఉందా? అసలు ఆంధ్రలో బి.జే.పి ఉనికి ఎంత?
దాని సత్తా ఎంతా?అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు? ఆ పార్టీకి ఊడేది ఏమి లేదు.

కాని ఖచితంగా నష్టపోయేది మనం, మన రాష్ట్రమే. మన పిల్లల భవిష్యత్తు మనమే నాశనం చేసుకుందామా? చంద్రబాబు లాంటి నాయకుడు కరెక్ట్ అని ఎన్నుకున్నాం కాబట్టి ఆయన అహర్నిశలు మనకోసం విశ్రమించకుండా కష్టపడుతున్నాడు.ఇవన్నీ వస్తున్నాయి.

అందరికీ కావాల్సింది ప్రత్యేక హోదా వల్ల ఒనగూరే ప్రయోజనాలు కాదు,                                                                     అందరికీ చంద్రబాబు హోదా (ముఖ్యమంత్రి హోదా) అంటేనే ఇష్టం.

మనం ఇక్కడ రాజకీయంగా మాట్లడటం కంటే… విజ్ఞతతో ప్రవర్తించాల్సిన సమయం ఇది.

మీరే ఆలోచించండి…

Advertisements
Standard